సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 21, 2020 , 03:20:11

నేడు ధాన్యలక్ష్మి అలంకరణ

నేడు ధాన్యలక్ష్మి అలంకరణ

భద్రాచలం : భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్ధానంలో జరగుతున్న  దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో  భాగంగా మంగళవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ‘ధనలక్ష్మి’ అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం రామాలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారిని కొలువుదీర్చారు. వేద పండితులు శ్రీ రామాయణ పారాయణోత్సవం,  అరణ్యకాండ పారాయణ హవనం చేశారు. మధ్యాహ్నం అమ్మవారికి సామూహిక కుంకుమార్చనను జరిపారు. సాయంత్రం మంత్రపుష్ప పూజ, దర్బారు సేవలను నిర్వహించారు. ఈ సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా బేడా మండపంలో స్వామి వారికి నిత్యం నిర్వహించే నిత్యకల్యాణాన్ని ఆలయ అర్చకులు కమనీయంగా జరిపారు. భక్తులు స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు అమ్మవారు ధాన్యలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తారు.