అమరావతి : ఏపీలో జికా వైరస్ ( Zika virus ) కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి(Boy) జికా వైరస్ సోకిందన్న వార్త వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. వెంటనే బాలుడి నుంచి రక్త నమూనాలను సేకరించి పుణె ల్యాబ్ (Pune Lab)కు పంపించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి (Minister Ramnarayana Reddy) స్పందిస్తూ బాలుడికి జికా వైరస్ సోకిందని నిర్దరణ కాలేదని అన్నారు. బాలుడికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు చెన్నైకు తరలించామని, గ్రామస్థులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వ్యాధి సోకిన బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి ప్రకటించారు.
గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. గ్రామంలో మొత్తం 150 గృహాలు ఉండగా ప్రతి కుటుంబానికీ వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, పుకార్లను నమ్మవద్దని, అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్థులను కోరారు.