ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈ వంద రోజుల్లో 30 వేల కోట్ల అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదని విమర్శించారు. అప్పులు, ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి చేతులెత్తేశారని, దీన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నీచమైన పాలిటిక్స్ చేసే వారు ప్రపంచంలో ఎక్కడా ఉండరని అన్నారు. నెయ్యి వచ్చింది, టెస్ట్ చేసింది అంతా చంద్రబాబు హయాంలోనే జరిగిందని తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చాకే టెండర్లు పిలిచారని, ఆ తర్వాతే సరఫరా కూడా జరిగిందని తెలిపారు.
మార్చి 16 నుంచి తమ ప్రమేయం లేదని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. తిరుమల, తిరుపతిలో రెండు ల్యాబ్స్ ఉన్నాయని.. అక్కడ అన్ని పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వాస్తవానికి ఉన్నతస్థాయి పరీక్షల కోసం మైసూర్ సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపుతారని.. కానీ ఈ శాంపిల్స్‌ను గుజరాత్ ఎన్డీడీబీకి పంపించారని చెప్పారు. ముందు రోజు ఎన్డీడీబీ ప్రస్తుత చైర్మన్ మనీషా, మాజీ చైర్మన్ వర్ష ఇద్దరూ శ్యామలరావును కలిశారని.. ఆ తర్వాతే ఈ రిపోర్టు వచ్చిందని తెలిపారు. గూడుపుఠాణీ చేసి జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
నెయ్యి కల్తీ అంశంపై ఈవో, ముఖ్యమంత్రి వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారని, రెండు నెలల తర్వాత ఈ నివేదిక విడుదల చేయడంలో ఆంతర్యమేంటని రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. కీలకమైన టీటీడీ రిపోర్టును టీడీపీ ఆఫీసులో విడుదల చేయడమేంటని నిలదీశారు. ఇవన్నీ చూస్తుంటే పెద్ద కుట్ర జరిగిందని స్పష్టమవుతుందని అన్నారు.
హిందువులను వైఎస్ జగన్‌కు దూరం చేయాలని కుట్ర పన్నారని స్పష్టమవుతుందని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. లడ్డూనే కాదు.. ఏ ఆహార పదార్థాల్లోనైనా జంతువుల కొవ్వు కలిపితే రెండు రోజుల్లోనే దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. కేవలం వైసీపీని దెబ్బతీయాలని ఎన్డీయే భాగస్వాములు అంతా కలిసి చేసిన కుట్ర అని విమర్శించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని అన్నారు.
వైఎస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తుంటే అడ్డుకుని, మేమెప్పుడు అడ్డుకున్నామంటూ బుకాయిస్తున్నాడని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైసీపీ నోటీసులిచ్చి, పోలీసులతో అడ్డుకున్నారని విమర్శించారు. పోలీస్ యాక్ట్ 30 పెట్టి వైసీపీ నాయకులను అడ్డుకుంటారా? ఇతర పార్టీల వాళ్లు తిరుమల చేరుకున్నా యాక్ట్ అమలు కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోమని సవాలు విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి ఇప్పటికే వైఎస్ జగన్ లేఖ రాశారని చెప్పారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, బాబుకు తొందరలోనే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.