YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు ఘటనలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా పోస్టులతో రెచ్చిపోయిన ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తోంది. అయితే ఇందులో కొందరిని మాత్రం చూసీ చూడనట్లుగా వదిలేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వారిపై చర్యలు లేవని విమర్శలు వస్తున్నాయి.
దీనిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. తన తల్లి విజయమ్మ, సోదరి సునీతపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన వ్యవహారంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు నిర్దారణకు వచ్చినా ఇప్పటివరకూ వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. వైసీపీ సైకో వర్రా రవీందర్ రెడ్డితో తమపై పోస్టులు పెట్టించిన అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి విచారించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ అనుచిత పోస్టులకు కారణమైన సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇప్పటికే వైఎస్ షర్మిల స్వాగతించారు. గతంలో తమపై పోస్టులు పెట్టిన వారందరినీ శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చిన్న చేపల్ని పట్టుకుని పెద్ద చేపల్ని వదిలేస్తుందన్న భావనలో షర్మిల ఉన్నారు. అందుకే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె ఇవాళ డిమాండ్ చేశారు.