అమరావతి : ఏపీలో వైసీపీ (YCP) ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఐదేండ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని కరాఖండిగా తేల్చి చెప్పారు. సోమవారం నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల (Assembly Session) మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బైకాట్ చేయడాన్ని పవన్‌కల్యాణ్ మీడియా పాయింట్లో తప్పుపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బైకాట్ చేయడం బాధాకరమని, ప్రతులను చించేయడం, ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా అనేది అడిగితే వచ్చేది కాదు. ప్రజలిస్తేనే వచ్చేదని అన్నారు. అసెంబ్లీలో అధిక సీట్లు వచ్చిన వారు అధికారంలో ఉంటారు. దాని తరువాత మెజార్టీ వారికి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇది సహజం. అంతేగాని గతంలో అధికారంలో ఉన్నామని ప్రతిపక్ష హోదా ఇవ్వరని పేర్కొన్నారు.
మొన్నటి ఎన్నికల్లో జనసేన కంటే ఒక్క సీటు వచ్చినా కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేది. ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, తాము అసెంబ్లీకి రాబోమని అనడం, గరవ్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరియైనది కాదని వ్యాఖ్యనించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. ప్రజలను గౌరవించి అసెంబ్లీకి రావాలని సూచించారు. మీ హోదాను బట్టీ అసెంబ్లీలో మీరడిగే ప్రశ్నలకు సమయం, సమాధానం ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉంటారని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
స్పీకర్ కూడా వైసీపీకి తగిన గౌరవం ఇస్తూ వచ్చారని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని కోరారు. ప్రతి దాన్ని అరుపులు, కేకలు వేయడం , సభను అడ్డుకోవడం దిగజారుడి వ్యవహారమని ఆరోపించారు. సరైన సూచనలు ఇస్తే స్వీకరించడానికి పాలక పక్షం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇచ్చేదికాదని , ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయని, ఆ ప్రకారమే హోదా లభిస్తుందని పేర్కొన్నారు.