Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ రెండో పెళ్లి వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన ఆయన కుమార్తెలు రోడ్డుపైనే ఆందోళన చేశారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి కూడా ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అసలు తమ మధ్య ఏం జరిగిందనే దానిపై సంచలన విషయాలను దువ్వాడ శ్రీనివాస్ బయటపెట్టారు.
తమది ముప్పై ఏళ్ల వైవాహిక జీవితమని.. ముందు నుంచే తమ మధ్య అంతర్గత విబేధాలు ఉన్నాయని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. కానీ గత రెండేళ్లుగా ఈ విబేధాలు తీవ్రమయ్యాయని.. ప్రతి రోజు ఏదో ఓ గొడవ జరిగేదని పేర్కొన్నారు. తన భార్య వాణికి ఉన్న రాజకీయ కాంక్ష, ఆధిపత్య పోరే ఈ గొడవలకు కారణమని చెప్పారు. తానే ఎమ్మెల్యే కావాలని.. వ్యాపారాలు అన్ని తన పేరు మీదనే ఉండాలని వాణి గొడవ చేసేదని వివరించారు. తనకు టికెట్ రాకపోతే నన్ను ఓడిస్తానని కూడా బెదిరించిదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఐదుసార్లు ఓడిపోవడానికి కారణం తన భార్య వాణినే అని వాపోయారు. తన ప్రథమ శత్రువు భార్య వాణినే అని స్పష్టం చేశారు.
విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చానని.. పాతికేళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేశానని.. మరెన్నో కేసులు ఎదుర్కొన్నానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఈ సారి మంచి అవకాశం వచ్చింది. జగనన్న టికెట్ ఇచ్చారని చెప్పారు. కానీ ఆ టికెట్ తనకే కావాలని వాణి రచ్చచేసిందన్నారు. వైఎస్ జగన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిందని చెప్పారు. టికెట్ కోసం విడాకులు కావాలని కూడా తనను అడిగిందని వాపోయారు. దీంతో చేసేదేమీ లేక ఆమె కోసం తన టికెట్‌ను త్యాగం చేశానని చెప్పారు. కానీ పార్టీలో వాణి గ్రాఫ్ పడిపోవడంతో ఎన్నికల ముందు తానే పోటీ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
వాణి తన పిల్లల్ని తనపై విషనాగుల్లా తయారు చేసిందని.. తన మీద శత్రుత్వాన్ని నూరిపోసిందని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ వాన తగలకుండా పిల్లల్ని బంగారంలా పెంచానని.. ఇద్దరు పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించానని.. ఏ లోటు లేకుండా చూశానని చెప్పారు. ఆస్తులు రాసిచ్చానని.. ఇల్లు, మైనింగ్ ఫ్యాక్టరీ ఇచ్చేశానని తెలిపారు. 1.50 కోట్లు నా పిల్లల ఖర్చులకు ఇచ్చానని పేర్కొన్నారు. నా పిల్లలకు ఏం లోపం చేశానని ప్రశ్నించారు.? టికెట్ విషయంలో తేడా కొట్టడంతో తన భార్య తనను ఇంట్లోకి రానివ్వలేదని వాపోయారు.. హోటల్లో ఉంటూ బయట తిరిగానని పేర్కొన్నారు. కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడకు రాళ్లు, గునపాలు తీసుకొచ్చి వచ్చారని చెప్పారు.. దశాబ్దాలుగా అంతర్గతంగా మా భార్యాభర్తల మధ్య వార్ కొనసాగుతోంది. కానీ ఎన్నడూ నాలుగు గోడలు దాటలేదని చెప్పారు.
దివ్వల మాధురిని రాజకీయాల్లోకి వాణినే తీసుకొచ్చిందని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఆమెను పావుగా చేసుకుని తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. ఆ కారణంగా మాధురి జీవితం నాశనమైందన్నారు. కన్నవారికి, మెట్టింటికీ దూరమైందన్నారు. ఆ పరిస్థితుల్లో చనిపోవాల్సిన అవసరం లేదని నేను ఆమెకు భరోసా ఇచ్చానని చెప్పారు. మాధురి అనే మహిళ ట్రాప్ చేయడానికి నేనేం చిన్నపిల్లాడిని కాదని అన్నారు.. మాధురికి నేను ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదని.. మాధురినే ఎన్నికలప్పుడు తన కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. ఇప్పుడు నా దగ్గర నయాపైసా లేదు. కాబట్టి నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందని ప్రశ్నించారు. ఇదంతా రాంగ్ అని కొట్టిపారేశారు. గత రెండేళ్లుగా భోజనం చేశావా? అని కూడా నా భార్య పిల్లలు అడగలేదని. ఈ రెండేళ్లుగా మాధురీనే నాకు అన్ని చూసుకుంటుందని స్పష్టం చేశారు.