జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పార్ట్‌టైం రాజకీయ నాయకుడని, పూర్తి కాలపు రాజకీయ నేత కాదని ఎద్దేవా చేశారు. అసలు పవన్ కల్యాణ్ మాటలకు, చేతలకు పొంతనే వుండదని విమర్శించారు. ఒక సారి చంద్రబాబుకు మద్దతిస్తారని, మరోసారి కాంగ్రెస్‌కో హఠావో అంటారని, మరో సారి చంద్రబాబు, లోకేశ్‌ను కలిపి తిట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్టు నేతలను తెగ పొగిడారని, తన ఆఫీసులో ఎటు చేసినా చేగువేరా ఫోటోలే కనిపించేవని, ఇప్పుడు అవన్నీ మాయమై, చంద్రబాబు ఫొటో పెట్టారని పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గతంలో బీజేపీని కూడా తిట్టారని, 2019 ఎన్నికలు అవ్వడమే ఆలస్యం… మళ్లీ బీజేపీ పంచన చేరారన్నారు. ఇవన్నీ చూస్తుంటే… పవన్ మాటలకు, చేతలకు పొంతనే కనిపించిందని పేర్కొన్నారు. చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం, సీఎం జగన్ అంటే విపరీతమైన ద్వేషం… ఈ రెండు తప్ప పవన్ దగ్గర ఏమీ లేవని విమర్శించారు. బీజేపీ దగ్గర వుంటూ… చంద్రబాబుకు కన్ను కొడుతున్నారని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.