Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమైంది. జంగిల్ క్లియరెన్స్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలు, రోడ్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ సందర్భంగా మంత్రి నారాయణ విమర్శించారు. గత ప్రభుత్వం అమరావతి రైతులతో మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు. రాజధాని ప్రాంతాన్ని అడవిగా మార్చారని మండిపడ్డారు.
సుమారు 24 వేల ఎకరాల్లో ముళ్ల చెట్లను తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. భవనాల పటిష్టతపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇస్తారని పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ చెన్నై నిపుణులు పరిశీలించారని.. ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారని అన్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు.
250 పొక్లెయిన్ల సాయంతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. దీనికోసం రూ.36 కోట్లు కేటాయించారు. ముళ్ల చెట్లు తొలగించాక అమరావతిలో కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు స్థలాలను అప్పగించనున్నారు.