తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించి దివ్యానుభూతిని కల్పించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ( TTD EO) శ్యామలరావు (Shyamala Rao) వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో (Dial Your EO) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు, అందరి సమన్వయంతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు.
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఆదేశాలు జారీ చేశామని భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాదానం ఇచ్చారు. ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు , హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు వివరించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు :
ఈ ఏడాది అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో ప్రకటించారు. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేస్తామని వివరించారు. ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయని, ఆగస్టు 14న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి పుష్కరిణిని మూసివేశామని ఈయన వెల్లడించారు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటుచేశామన్నారు.
ఆఫ్‌లైన్‌లో రోజుకు వెయ్యి శ్రీవాణి దర్శనం టికెట్లు
సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకుగాను జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం (Srivani Darsan) టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించామని శ్యామలారావు తెలిపారు. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో జారీ చేస్తున్నామని వివరించారు.
తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు
శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అనన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీఈవో, అధికారులు పాల్గొన్నారు.