AP News | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నోటి దురుసు వల్లే ఓడిపోయామని చాలామంది అంటున్నారని.. అదే నిజమైతే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. తాడేపల్లిలో అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ అపజయానికి కారణాలు విశ్లేషిస్తున్నామని చెప్పారు. లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో తమకు సీట్లు రాకపోయినప్పటికీ 40 శాతం ఓట్ల షేర్ ఉందని అనిల్‌కుమార్ అన్నారు. తమకు ప్రతిపక్షం కొత్త కాదని.. పదేండ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తు చేశారు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డామని.. ఇప్పుడు కూడా అలాగే ఉంటామని చెప్పారు. ఓడిపోయామని ఇంట్లో కూర్చోమని అన్నారు. ఎక్కడికీ పారిపోమని.. ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. అధికార పార్టీకి కొంత సమయం ఇస్తామని.. ఆ తర్వాత వాళ్ల తప్పులపై నిలదీస్తామని చెప్పారు.