అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ ( Super Six) పేరుతో అధికారంలోకి వచ్చి తీరా బడ్జెట్లో నిధులు కేటాయించక ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కె రోజా (RK Roja) ఆరోపించారు. ఇచ్చిన హామీలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు చంద్రబాబును నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారని ట్విట్టర్లో (Twitter) పేర్కొన్నారు.
రాష్ట్రంలోని యువత, మహిళలను, రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ పథకానికి రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు కేటాయించాల్సి ఉండగా బడ్జెట్లో (Budget) ఎంత కేటాయించారని ప్రశ్నించారు.
దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లకు 1,54,47,061 కనెక్షన్లకు రూ.4,115 కోట్లు ఖర్చు అవుతుందని, వాటికి అరకొరా నిధులు కేటాయించారని ఆమె విమర్శించారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, అన్నదాతకు ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని బడ్జెట్లో తక్కువ కేటాయింపులు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకు అతీగతీలేదని అన్నారు.
యువగళం కింద రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇవ్వడానికి రూ.7,200 కోట్లు అవసరం ఉండగా బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తే కేసులు పెడుతామని, అరెస్టులు చేస్తామని బెదిరింపులు చేస్తున్నారని మండిపడ్డారు.