Pawan Kalyan | రాష్ట్రంలోని పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని తెలిపారు. ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేమని అభిప్రాయపడ్డారు. పంచాయతీల్లో మార్పు తీసుకొచ్చేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.
తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి శుక్రవారం పవన్ కల్యాణ్ వచ్చారు. ఈ సందర్భంగా సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్పై కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరంపంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్పై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జలం మనకు పూజ్యనీయమని.. కాలుష్యం కాకుండా కాపాడుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం ప్లాస్టిక్ చెత్తాచెదారంతో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు అని అన్నారు. మనుషులకే కాదు.. జంతువులకు కూడా ప్రమాదకరమే అని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉందని అన్నారు. పంట కాలువలు డంపింగ్ యార్డుల్లా మారాయని అన్నారు. కాలువల్లో చెత్తను వేస్తే నీరు కలుషితమవుతుందని అన్నారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ సరిగ్గా జరగడం లేదని అన్నారు. చెత్త నిర్మూలనకు ప్రతి ప్రభుత్వం ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు. ఏటా రూ.243కోట్ల విలువైన వ్యర్థాలను పాడేస్తున్నామని చెప్పారు. చెత్త, వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిఠాపురంలోని తన కార్యాలయం నుంచే SLRMను ప్రారంభిస్తామని తెలిపారు.
వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామన్నారు. పనికిరాదని మనం పడేసే చెత్తతో ఏటా రూ.2643 కోట్ల ఆదాయం రావచ్చని అన్నారు.రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుందని చెప్పారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బుల్లేవని అన్నారు. పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యంచేసిందని ఆరోపించారు. ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేమన్నారు. పంచాయతీల్లో మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.