YS Sharmila : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ (శుక్రవారం) ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులో ఆమె విజయవాడ బస్ స్టాండ్ నుంచి తెనాలి వరకు ప్రయాణం చేశారు. తెలంగాణ, కర్ణాటకలో మాదిరిగానే ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. బస్సులో సాటి ప్రయాణికులతో ఆమె ముచ్చటించారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం అవసరమా.. లేదా..? అని మహిళలను ప్రశ్నించారు.
పలువురు మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ ఉచిత బస్ సౌకర్యం కావాలనే చెప్పారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ నేతలు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని ఎందుకు నెరవేర్చడం లేదని షర్మిల ప్రశ్నించారు. ఇచ్చిన హామీని మర్చిపోయారా..? అని నిలదీశారు. కాగా, ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులు కొందరు షర్మిలతో సెల్ఫీలు తీసుకున్నారు. షర్మిల పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Andhra Pradesh Congress President YS Sharmila travels on a ‘Pallevelugu’ RTC bus from Vijayawada Bus Stand to Tenali
(Source: Congress) pic.twitter.com/Ln7gZXHLZw
— ANI (@ANI) October 18, 2024