విశాఖపట్నం : అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మనాలిలో చిక్కుకుపోయారు. మనాలి నుంచి చండీగఢ్ వెళ్లే మార్గంలో లారీపై బండరాళ్లు పడటంతో లారీ బోల్తా పడింది. దాంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విశాఖకు చెందిన 95 మంది కార్పొరేటర్ల బృందం మనాలిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నది.
మనాలి-చండీగఢ్ రహదారిలో జోరుగా కురుస్తున్న వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మార్గంలో వెళ్తున్న ఓ లారీపై పెద్దపెద్ద రాళ్లు పడటంతో లారీ బోల్తాపడింది. దాంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వాన జోరుగా కురుస్తుండటం, రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో మనాలి వద్ద కార్పొరేటర్ల పర్యటన నిలిచిపోయింది. కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న ప్రాంతానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నది. చండీగఢ్ బయల్దేరేందుకు బస్సులో బయల్దేరిన విశాఖ కార్పొరేటర్లు రాత్రంతా బస్సులోనే జాగారం చేశారు. మహిళా కార్పొరేటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే కార్పొరేటర్లందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది.
విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 10 గంటల తర్వాత ఈ రహదారిని క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ బృందం తదుపరి చండీగఢ్‌కు బయల్దేరుతుంది. ఉత్తర ఆంధ్రలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ అధ్యయన పర్యటనలో ఉన్నారు. ఈ నెల 23న వీరంతా వైజాగ్‌కు తిరిగి రానున్నారు. కార్పొరేటర్లు అంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందడంతో వారి కుటుంబసభ్యులు, మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.