అమరావతి : ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదంపై ఎట్టకేలకు తల్లి విజయమ్మ (YS Vijayamma) స్పందించింది. గత కొన్ని రోజులుగా కొడుకు వైఎస్ జగన్(Jagan), కూతురు షర్మిల (Sharmila) మధ్య జరుగుతున్న ఆస్తుల పంపకంపై అసలు నిజాలు వెల్లడిస్తూనే వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) , విజయసాయి రెడ్డిలు( Vijayasai reddy ) అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం విజయమ్మ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులకు(YSR Fans) సుదీర్ఘ లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బాధేస్తోందని, జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని, అబద్ధాల పరంపర కొనసాగకూడదనే ఉద్దేశంతో తాను స్పందిస్తున్నానని వెల్లడించారు.
అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే వైఎస్సార్ మాట కూడా ముఖ్యమే. ఆస్తులు ఇద్దరు బిడ్డలకు సమానం అనేది నిజం. నలుగురు పిల్లలకు ఆస్తులు సమానంగా ఉండాలన్నది వైఎస్సార్ ఆదేశమని తెలిపారు.
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి స్పృహ లేకుండా మాట్లాడడం బాధించింది
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి స్పృహ లేకుండా, ఎన్నో అసత్యాలు మాట్లాడడం బాధించిందని అన్నారు. వైఎస్సార్ కుటుంబ పరువును తీస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ చేసింది ఆస్తులు పంచలేదని, ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారని స్పష్టం చేశారు. ఆస్తులకు ఆడిటర్‌గా ఉన్న విజయసాయి రెడ్డి అన్ని తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారని ఆరోపించారు. వైఎస్సార్‌పై అభిమానం, ప్రేమ ఉంటే ఇతరులు ఎవరూ కూడా ఎక్కువగా మాట్లాడవద్దని, ఇతరులను రెచ్చగొట్టవద్దని లేఖలో పేర్కొన్నారు.