తిరుమల : తిరుమల కొండపైకి వెళ్లే రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను మంగళవారం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్)పై భారీ బండరాళ్లు కూలిపోయాయని అన్నారు. ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను శరవేగంగా చేపట్టి పునరుద్ధరిస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచే రెండో ఘాట్ రహదారిలో వాహన సేవ తిరిగి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.
అయితే భారీ వాహనాలు లింక్ రోడ్డు ద్వారా మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర్రావు, ఎస్ఈ జగదీశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.