అమరావతి : రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) గొప్ప దేశ భక్తులలో ఒకరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan) అన్నారు. వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా పవన్‌కల్యాణ్ జనసేన తరుఫున మంగళవారం ట్విటర్ (Twitter) వేదిక ద్వారా నివాళి అర్పించారు. మాతృభూమి స్వేచ్ఛ కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడని అభివర్ణించారు.
అటల్జీ అసాధారణ మాటతీరు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే సామర్ధ్యం గల గొప్ప రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు. అతని పదాలు , పద్యాలు లక్షలాది మంది హృదయాలను తాకాయని, చాలా మందికి స్ఫూర్తినిచ్చాయని అన్నారు. పార్లమెంట్లో ఆయన విలక్షణమైన మాటలు తనకు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేశాయని పేర్కొన్నారు. దేశాన్ని ఐక్యత వైపు పరుగులు పెట్టించారని వెల్లడించారు.
వాజ్‌పేయి నాయకత్వం భారతదేశ పరిస్థితులను మార్చివేశాయని స్వర్ణ చతుర్భుజం నుంచి, పోఖ్రాన్ అణు పరీక్షల ( Pokhran Nuclear Tests) వరకు, సర్వశిక్షా అభియాన్ నుంచి అందరికీ విద్యను అందించే అన్నపూర్ణ అన్న యోజన వరకు అహర్నిశలు ప్రజల కోసం శ్రమించారని తెలిపారు. అటల్జీ జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. వాజ్‌పేయి అమర పదాలలో ‘ ఛోటే మన్ సే కోయ్ బడా నహీం హోతా, టూటే మన్ సే కోయ్ ఖడా’ అనే పదం చిరకాలంగా నిలిచిపోతుందన్నారు.