తిరుమల : కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) నిన్న తిరుమలలో (TTD ) చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి( Karunakar Reddy) తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. టీటీడీలో వెయ్యిమంది అన్యమతస్థులు ఉన్నారని, వారిని వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి వ్యాఖ్యనించారు.
బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలోనే టీటీడీ ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే మంత్రి వెయ్యి మంది అని ఎలా అంటారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా తెలియజేయాలని డిమాండ్ చేశారు. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రకటనపై పవన్ కల్యాణ్ సహా కూటమి నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బండి సంజయ్ ప్రకటన శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని తెలిపారు.