తిరుపతి : కాణిపాకం (Kanipakam) శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టీటీడీ తరుఫున చైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu) పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో తిరుకల్యాణం సందర్భంగా టీటీడీ ప్రతి ఏడాది పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు ఆలయ ఈవో పెంచెల కిషోర్ కుమార్, ఏఈవో రవీంద్ర బాబు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, బొక్కసం ఇన్చార్జి గురురాజ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.