TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో ఎనిమిదో తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నష్టపరిహారం చెల్లించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏడుగురు బాధితులకు శనివారం స్విమ్స్ డైరెక్టర్ చాంబర్లో పరిహారం అందజేశారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, టిటిడి జేఈవో వీ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్వీ కుమార్ సమక్షంలో చెక్‌లను పంపిణీ చేశారు.
ఈ నెల ఎనిమిదో తేదీన జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామవాసి ఎస్.తిమ్మక్కకు రూ.5 లక్షలు, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం వాసి పీ ఈశ్వరమ్మలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేశారు. గాయ పడిన మరో ఐదుగురు బాధితులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున పరిహారాన్ని అందజేశారు. పరిహారం అందుకున్న వారిలో అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామ వాసులు కే నరసమ్మ, పీ రఘు, కే గణేష్, పీ వెంకటేష్, చిన్న అప్పయ్య ఉన్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టిటిడి పాలకమండలిలోని కొంత మంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.విశాఖ, నర్సీపట్నం సందర్శించే బృందంలో పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణ మూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎం.ఎస్ రాజు, జీ భానుప్రకాశ్ రెడ్డి ఉన్నారు. తమిళనాడు, కేరళ బోర్డర్ సందర్శించే కమిటీలో రామమూర్తి, కృష్ణ మూర్తి, వైద్య నాథన్, నరేష్ కుమార్, శాంతా రామ్, సుచిత్రా ఎల్లా ఉన్నారని తెలిపారు.
మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు నియమించిన రెండు కమిటీల రవాణా తదితర ఖర్చులను టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు సొంత నిధుల నుండి చెల్లించనున్నారు.ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జీ భానుప్రకాశ్ రెడ్డి, శాంతారామ్ , స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.