Tirumala hundi gifts : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వేంకటేశ్వర స్వామి వారి కానుకలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో చాలా మంది నగదును కానుకగా ఇస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం వస్తువులను కానుకలుగా సమర్పిస్తారు. కొందరు తలనీలాలు మాత్రమే ఇస్తే.. మరికొందరు తలనీలాలతోపాటు బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, విదేశీ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, కెమెరాలు, మొబైల్స్, చేతి వాచీలు సహా రకరకాల వస్తువులను స్వామివారి హుండీలో వేస్తుంటారు.
అలా భక్తులు స్వామి వారికి కానుకలుగా సమర్పించిన వస్తువులను ఇప్పుడు వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ వేలంలో కానుకలను సొంతం చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించింది. ఈ మేరకు ఏమేం కానుకలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు వేలం వేస్తారు. వేలంలో ఏయే వస్తువులు పెట్టనున్నారో తెలుపుతూ టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. మరో విషయం ఏమిటంటే వేలాన్ని ఆఫ్ లైన్ విధానం ద్వారా నిర్వహించనున్నారు. ఆసక్తిగల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనాలని టీటీడీ తెలిపింది.
తిరుమలతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయనున్నారు. భక్తులు స్వామి వారికి సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28న వేలం వేయనున్నారు. వాటిలో ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు కూడా ఉన్నాయి. మొత్తం 6 లాట్లు ఉండగా వాటిని ఆగస్టు 28న వేలం వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే కాపర్-2, సిల్వర్ కోటెడ్ రాగి రేకులను ఆగస్టు 30, 31 తేదీల్లో టెండర్ కమ్ వేలం వేయనున్నారు.
ఆగస్టు 30న కాపర్- 2 రేకులు 3 వేల కేజీలను 15 లాట్లుగా పెట్టి వేలం వేస్తారు. అలాగే ఆగస్టు 31న సిల్వర్ కోటెడ్ రాగి రేకులు 2,400 కేజీలను 12 లాట్లుగా పెట్టి వేలం వేయనున్నారు. టెండర్ లేదా వేలంలో పాల్గొనాలనుకునే భక్తులు మరింత సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ ఆఫీసులో సంప్రదించాలి. దూరప్రాంతాల వారు 0877-2264429 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. www.tirumala.org ద్వారా కూడా టెండర్, వేలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు.