అమరావతి : దీపావళి పండుగపూట ఏపీలోని ఏలూరు (Eluru) జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో సంతోషంగా పండుగను జరుపుకునేందుకు బాణసంచా(Fire Crakers) కొనుగోలు చేసి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం (Road accident) జరిగి ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు పరిస్థితి విషమంగా మారింది.
గురువారం ఏలూరులోని తూర్పువీధిలో ఓ వ్యక్తి స్కూటీపై బాణసంచా తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న బాణసంచా పేలింది. పేలుడు ధాటికి స్కూటీపై ఉన్న సుధాకర్ అనే వ్యక్తి శరీరం ఛిద్రమైంది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు . ఘటనపై మంత్రి పార్థసారథి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తరలింపులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.