Tomato Price | సామాన్యులకు షాకింగ్ న్యూస్.. టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. పది రోజుల కిందటి వరకు కిలో 10 రూపాయలే పలికి టమాటా ధర ఇప్పుడు 80 రూపాయల వరకు చేరింది. తెలంగాణలోని రాయదుర్గం, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన మార్కెట్లలో టమాటా కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతుంది. ఇక మదనపల్లె మార్కెట్లో అయితే రూ.63కు చేరింది.
ఈ సీజన్లో మొంథా తుపాన్ తీవ్ర బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుపాన్ కారణంగా పలు ప్రాంతాల్లో టమాటా పంట భారీగా నాశనమైంది. తుపాన్ సమయంలో వరదలు, గాలివానలు ఉండటంతో టమాట తోటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాది ఇదే సమయంలో సగటున దాదాపు 700 మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లె మార్కెట్కు రాగా.. ఇవాళ కేవలం140 మెట్రిక్ టన్నుల టమాట మాత్రమే రావడం గమనార్హం. దీనివల్లే టమాట ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని రైతులు తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.