AP News | తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయన ఆ అసహనాన్ని రైతులపై చూపించారు. కుక్కలకు ఉండే విశ్వాసం కూడా.. రైతులకు ఉండదన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దూషించడంతో చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు సతీమణి ఆత్మహత్యకు యత్నించడం ఇటీవల దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేశారు. అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే లక్షల రూపాయలు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించానని కొలికిపూడి గుర్తు చేశారు. అదంతా రైతుల కోసమే చేశానని చెప్పారు. అయినప్పటికీ ఈ రోజు తనకు అండగా ఏ ఒక్క రైతు రాలేదని ప్రశ్నించారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. కానీ కొందరికి ఉండదని వ్యాఖ్యానించారు. ఇదే మాటను ఒకటికి రెండు సార్లు కొలికిపూడి నొక్కి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కుక్కలకు ఉన్న విస్వాసం రైతులకు ఉండదు – టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు pic.twitter.com/mhEqKMk9Tt
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2024
అసలు వివాదమేంటి?
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తనను అకారణంగా దుర్భాషలాడటమే కాకుండా, తనపై దాడి చేసేందుకు 20 మంది మనుషుల్ని పంపించారని చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఇటీవల ఆరోపించారు. ఈ విషయం తెలిసి తన భార్య కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. తననే కాకుండా తిరువూరులోని టీడీపీ శ్రేణులను కడా పరుష పదజాలంతో దూషిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో కొలికిపూడి వ్యవహారం తిరువూరులో వివాదాస్పదంగా మారింది. ఆయనకు నిరసనగా టీడీపీ నేతలు ధర్నాలు చేసి అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేశారు.