హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేం చేయగా, హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీమలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.