తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తులకు ఇబ్బంది కలిగించేలా సులభ్ పారిశుధ్య కార్మికులు(Sanitation workers) సమ్మెకు దిగడం సరైందని కాదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ముందస్తు నోటీసు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై టీటీడీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు, ఉద్యోగులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ చెప్పారు.
ఇదే సందర్భంలో కార్మికుల బెదిరింపులను టీటీడీ లెక్క చేయదనే విషయం గుర్తించాలన్నారు. భక్తులను మోసగించేలా కొన్ని ఫేక్ వెబ్సైట్లు(Fake website) వ్యవహరిస్తున్నాయని అలాంటి వాటిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి..
టీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి టీటీడీ ప్రత్యేక కృషి చేస్తోందని చైర్మన్ వెల్లడించారు. తిరుపతిలోని వినాయకనగర్ టీటీడీ క్వార్ట్రర్స్ లో ఉద్యోగుల కోసం రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్(Function Hall) ను గురువారం ఆయన ప్రారంభించారు. ఉద్యోగుల 20 సంవత్సరాల కల అయిన ఇంటిస్థలాలను సాకారం చేశామన్నారు.
ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందేందుకు ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగులు మరింతగా భక్తుల సేవ చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎస్టేట్ ఓఎస్డీ మల్లిఖార్జున, డిప్యూటీ ఈవో స్నేహలత పాల్గొన్నారు.