అమరావతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి స్కాముల ( Scams )పాలన కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయవలిసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాడేపల్లి నివాసంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ ( YCP ) నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు నడుస్తున్నాయని. ప్రతీ ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు మాఫియా ద్వారా వస్తున్న డబ్బులను పంచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రెడ్‌బుక్ ( Redbook ) రాజ్యాంగం నడుస్తోందని వెల్లడించారు. ఆరు నెలలు గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్దాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.
ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నాడని వివరించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటీని గాలికి వదిలేశారని జగన్ వెల్లడించారు. రైతు భరోసా, పంటల బీమా వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు దొరకక రైతులు నష్టాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 27న కరెంటు ఛార్జీల మీద పార్టీ చేపడుతున్న నిరసనలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయని, కేసులు కూడా పెడతారని అధైర్యపడవద్దని సూచించారు. చంద్రబాబు విజన్ 2047 పేరిట మరో డ్రామాకు తెర తీశారని ఆరోపించారు. సీఎం చేస్తున్నది విజన్ కాదని దగా అని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో కొత్త పెన్సన్లు ఇవ్వకపోగా లక్షలాది పెన్షన్లు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శంకర్‌నారాయణ, ఉషశ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు.