అమరావతి : ఏపీలో ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS) అధికారులను హెచ్చరించినా, వారిమీద చిన్నగాటు పడినా వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పేర్కొన్నారు. అలాంటి వారిపై సుమోటో కేసులు నమోదు చేస్తామని, వారు ఎక్కడా ఉన్న పట్టుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమది మంచి ప్రభుత్వమేకాని మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు.
వైసీపీ (YCP) పాలనలో అధికార దుర్వినియోగం జరిగిందని, ఉన్నతాధికారుల విధుల నిర్వహణలో జోక్యం చేసుకుని వారిచే ఇష్టారాజ్యంగా పనులు చేయించారని అన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందిస్తుందని, అధికారుల విధుల నిర్వహణలో జనసేన కార్యకర్తలుజోక్యం చేసుకోవోద్దని, వారిని విమర్శించవద్దని కోరినట్లు తెలిపారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని పదేపదే చెబుతున్నామని పేర్కొన్నారు. అటవీశాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోకూడదని తెలిపారు.
ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తూ 23 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని వివరించారు. అమరుల స్మరణకు ఫారెస్టు ఆఫీస్ బ్లాక్‌లకు వారి పేర్లు పెట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.