Pawan Kalyan | పదేండ్ల క్రితం తాను పార్టీ పెట్టినప్పుడు తన వెంట ఎవరూ లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పుడు తనకు రాజకీయాలు తెలియవని చెప్పారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వంటి జాతీయ నాయకులు నాకు స్ఫూర్తి అని అన్నారు. మంగళవారం జనసేన పదో ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో జరిగింది. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తనకు స్వార్థం లేదన్నారు. అణగారిన వర్గాలకు చేయూత ఇవ్వడానికి, అగ్రకులాల్లోని పేదలకు అండగా నిలిచేందుకు ఎంతో మంది పార్టీలు పెట్టారని, రాజకీయాలు తట్టుకోలేక మధ్యలో వదిలేశారని అన్నారు.
కానీ, సగటు మనిషికి మేలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్ని అడ్డంకులైనా వెనుకడుగు వేయనని తెలిపారు. సమాజం మేలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. `మీ అభిమానం నాకు అండగా నిలిచింది. ఒక్కడిగా మొదలై ఇప్పుడు పులివెందుల సహా ప్రతి చోటా 500 మంది క్రియాశీలక మంది కార్యకర్తల్ని సంపాదించుకున్నా.. మొత్తం ఏపీ అంతటా 60.50 లక్షల మంది, తెలంగాణలో 30 వేల మంది అభిమానులు ఉన్నారు` అని చెప్పారు.
`జనసేన కార్యకర్తలుగా మీ అభిమానం నాకు ధైర్యం.. అదే నాకు కవచం.. మీ కోసం ఓటమిని ఎదుర్కొని ఓరిమితో నిలబడతా.. ప్రజల ఆశీస్సులతో ఒక్కరోజైనా పని చేసే జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తా
ధర్మో రక్షిత రక్షిత.. ధర్మాన్ని రక్షించాలి. చట్టం అంటే ధర్మాన్ని నిలబెట్టడమే కానీ, చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కాదు` అని పవన్ కల్యాణ్ అన్నారు.