అమరావతి : ఏపీలో నిర్వహించిన డీఎస్సీ ( DSC) 2025 నియామకాల కుంభకోణంలో రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ఆరోపించారు. ఈ డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియా , వివిధ ప్రసార మాధ్యమాలు విస్తృతంగా వాస్తవాలను ప్రచారం చేస్తుండగా వాటి అకౌంట్లను చంద్రబాబు బ్లాక్ చేయిస్తున్నారని ట్విటర్లో విమర్శించారు.
నిజాన్ని వెలికితీసేందుకు సీబీఐ విచారణకు అంగీకరించడానికి బదులుగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతుకలను అణచి వేయాలని చూస్తుందని పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేవి భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులని గుర్తు చేశారు. కేవలం వారి ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షాలను, మీడియాను, కార్యకర్తలను , పౌరుల గొంతు నొక్కే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు, మీరు దేనికి భయపడుతున్నారు? ప్రశ్నలకా లేక సమాధానాలకా? డీఎస్సీ నియామకాలలో ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్న ఆధారాలు అబద్ధమైతే, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని తప్పు అని నిరూపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్షలు కూడా రాయకుండానే , టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.