Pawan Kalyan | తన దృష్టిలో నిజమైన హీరోలు టీచర్లే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. హీరోలను సినిమాల్లో నటించేవారిలో కాదు.. మీ అధ్యాపకుల్లో చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ విషయాన్ని ఒక సినీ నటుడిగా చెబుతున్నానని అన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్ మెగా టీచర్-పేరెంటింగ్ మీట్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సింహం గడ్డం గీసుకుంటది నేను గీసుకోను అని డైలాగులు చెబితే వెనుక రీరికార్డింగ్‌లు వస్తాయి.. సినీ హీరోలు నడిస్తే రీరికార్డింగ్‌లు ఉంటాయని అన్నారు. కానీ కార్గిల్‌లో చనిపోయిన వారికి, ఉపాధ్యాయులకు రీరికార్డింగ్‌లు ఉండవని అన్నారు. కానీ వారే నిజమైన హీరోలని.. వారిని గౌరవించాలని సూచించారు.
రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాదని.. సాహిత్యానికి నిలయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. గొప్ప మహనీయులు నడియాడిన నేల కడప అని అన్నారు. అన్నమయ్య, వేమన, మొల్ల పుట్టపర్తి నారాయాణచార్యులు పుట్టిన నేల ఇది అని అన్నారు. గొప్ప ప్రాంతం కాబట్టే ఇక్కడి సమావేశానికి వచ్చానని తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకునేలా రాయలసీమ మారబోతుందని అన్నారు.
సరైన చదువు లేకపోతే సమాజం ముందుకు నడవడం కష్టమని పవన్ కల్యాణ్ అన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా మెలగాలని సూచించారు. తల్లిదండ్రులు, టీచర్ల మధ్య సమన్వయం పెరగాలని అన్నారు. దేశం బాగుండాలంటే అధ్యాపకులపై పెట్టబడులు పెట్టాలని అభిప్రాయపడ్డారు. అందరికంటే టీచర్లకు ఎక్కువ జీతం ఉండాలనేది తన కోరిక అని చెప్పారు. సమాజంలో సైబర్ క్రైమ్ రోజురోజుకూ పెరుగుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. సోషల్‌మీడియాపై అదనపు ఆంక్షలు ఉండేలా కేంద్రాన్ని కోరతానని చెప్పారు. ఆస్ట్రేలియా తరహాలో సోషల్‌మీడియా చట్టాలు తీసుకొస్తామని వెల్లడించారు.
నేటి సమాజానికి విలువతో కూడిన విద్య అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సోషల్‌మీడియాలో ఏం చూస్తే భవిష్యత్తులో అలాగే తయారవుతారని తెలిపారు. విలువలు పాటించే వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి సహాయ గుణం అలవాటు చేసుకోవాలన్నారు. ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ దూరం చేయాలని తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా తరహాలో సోషల్‌మీడియా చట్టాలు తీసుకొస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల భవనాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే గుండా యాక్ట్ పెట్టడం తథ్యమని హెచ్చరించారు.