Buddha Venkanna | గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని విమర్శించారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి సారథ్యంలో మరో దోపిడీ జరిగిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఖజానాకు గండికొట్టారని అన్నారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వేల కోట్లు దోచేశారని.. జగన్ డైరెక్షన్లోనే ఈ స్కామ్ జరిగిందని విమర్శించారు.
టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ కుంభకోణంపై సీఐడీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సహకరించిన అధికారులపైనా ఫిర్యాదు చేస్తామని అన్నారు. జగన్ను ఏ1గా చేర్చి విచారించాలని కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొస్తామని వెల్లడించారు.