AP News | వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఓ బాలీవుడ్ నటిని వైసీపీ నాయకుడు వేధించారనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ స్పందిస్తూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్, నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడింది. ముంబైకి చెందిన నటిని కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల నాగేశ్వరరావు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని.. పెళ్లి చేసుకోమని అడిగితే అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు దిగాడని వైసీపీ ఆరోపించింది. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లి మరీ హీరోయిన్ను విజయవాడకు తీసుకొని వచ్చి ఆమెను వేధింపులకు గురిచేశారని విమర్శించింది.
బాలీవుడ్ హీరోయిన్‌పై వైసీపీ నేత వేధింపుల విషయంలో నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్రెస్ట్ అని వైసీపీ ప్రశ్నించింది. ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ విషయాన్ని డీల్ చేశారంటే జగన్ రెడ్డి అనుమతులు లేకుండానే జరుగుతుందా? అని నిలదీసింది. బాలీవుడ్ హీరోయిన్ను వేధించడంలో ఏకంగా నాటి సీఎంవో ప్రమేయం ఉందంటే.. జగన్ రెడ్డి ఎలాంటి మాఫియా నడిపాడో అర్థమవుతుందని ఎద్దేవా చేసింది. మీ ముఖ్య సలహాదారు సజ్జలను ఇలాంటి బ్రోకర్ పనులకు వాడతావా? అని మండిపడింది. నీకింద ఉండే ఐపీఎస్‌లను ఇలాంటి తప్పుడు పనుల కోసం వాడుకుంటావా? మీకు నచ్చిన హీరోయిన్లను వేధించి లొంగదీసుకోవడానికా మీకు అధికారాన్ని ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ రావుకు హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లినప్పుడు ముంబైకి చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడింది. అది కాస్త సన్నిహిత సంబంధాలకు దారి తీసింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఆ నటి కోరగా అందుకు విద్యాసాగర్ నిరాకరించారు. అయినప్పటికీ ఆమె నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి మరింత ఒత్తిడి రావడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఆశ్రయించారు.
ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం బయటపడితే తమ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని భావించి.. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలని నాటి విజయవాడ సీపీ కాంతిరాణాను ఆదేశించారు. దీంతో ఆగమేఘాల మీద ముంబై వెళ్లిన కాంతి రాణా.. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఒక బృందాన్ని పంపించి.. సదరు నటి, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం వారిని బెదిరించారు. మళ్లీ పెళ్లి మాట ఎత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో నటి కుటుంబం ఎదురించలేక ముంబై తిరిగి వెళ్లిపోయింది.