Free Bus | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదివరకటిలా ఇంట్లో భర్త విసుక్కున్నా, కసురుకున్నా పడాల్సిన అవసరం లేదని.. ఫ్రీ బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు.
ఏలూరు జిల్లా తిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్పౌస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని తెలిపారు. 15వ తేదీ నుంచి ఆడపిల్లలు ఇంట్లో భర్త విసుక్కున్నా.. కసురుకున్నా .. పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎంచక్కా ఫ్రీ బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్లిపోండి అని సూచించారు. అప్పుడు భర్తలే డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి మరీ ఇంటికి తీసుకెళ్తారని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం మద్దిపాటి వెంకటరాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్గా మారింది.
చూశారా ….వీడెవడో కాపురాలు కూల్చే మాటలు చెబుతున్నాడు 🔥🔥
భార్యలకు బస్సు ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చి…
ఆ డబ్బులను భర్తల ద్వారా లాగేయడానికి భలే సలహా ఇచ్చారు మా గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారు….! pic.twitter.com/KW5dcFVFkm
— Bhaskar Reddy (@chicagobachi) August 3, 2025
మద్దిపాటి చేసిన వ్యాఖ్యలకు సభలో ఉన్నవారంతా నవ్వుకున్నారు కానీ.. సోషల్మీడియాలో మాత్రం పలువురికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ వ్యాఖ్యలు మహిళలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. కాపురాలు కూల్చే మాటలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.