విజయవాడ: టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ శ్రేణులు, నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుద్ధా వెంకన్నపై సెక్షన్ 153 ఏ, 506, 505 సబ్ సెక్షన్ 2 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రేపు ఉదయం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ డీజీపీతోపాటు మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేగుతున్నది. ఈ నేపథ్యంలో బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై పోలీసులు వివరణ కోరనున్నారు. అందుకుగానే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఏం జరిగినా సిద్దమేనని, అన్నింటికి తాను తెగించే ఉన్నానని బుద్దా వెంకన్న చెప్తున్నారు. ప్రభుత్వం క్యాసినోపై నిజానిజాలు తేల్చకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. మంత్రి ఆధ్వర్యంలోనే క్యాసినో జరిగినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. పోలీసులకు గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ కనిపించకపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు.