YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ పల్లె బాగుపడదని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. 14 ఏండ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైసీపీ మార్క్ మాత్రమే కనిపిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావాన్ని ఏపీ సీఎం జగన్ పూరించారు. భీమిలిలో శనివారం నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్న ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేక.. చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
సభకు వచ్చిన జనాలను చూస్తుంటే.. కురుక్షేత సమరానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు కనిపిస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే.. అక్కడ కౌరవ సైన్యం ఉందని విమర్శించారు. వాళ్ల సైన్యంలో దుష్టచతుష్టయం ఉందని.. గజదొంగల ముఠా ఉందని ఎద్దేవా చేశారు. వారి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసపూరిత వాగ్ధానాలు, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తుందని అన్నారు. కానీ పద్మవ్యూహంలో చిక్కుకుని వాళ్ల బాణాలు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు అని స్పష్టం చేశారు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, కార్యకర్తలు.. ఇంతమంది తోడు కృష్ణుడి రూపేనా అండదండలు ఉన్నాయని అన్నారు. అందుకే మీ బిడ్డ భయపడడు అని స్పష్టం చేశారు. పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తున్న పథకాలే.. మనకు బాణాలు, ఆస్త్రాలు అని తెలిపారు. ఈ యుద్ధంలో 175 స్టానాలకు 175 వైసీపీ టార్గెట్ అని అన్నారు. మనం చేసిన మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు.
అభివృద్ధి చేశానని చెప్పుకోలేక.. కొత్త వాగ్దానాలతో గారడీ చేస్తున్నారు
75 ఏండ్ల వయసు మళ్లిన చంద్రబాబుకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని జగన్ ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడంటే.. దాని అర్థమేంటో ఆలోచన చేయాలని సూచించారు. తాను ఫలానా మంచి పనిచేశానని, ఫలానా స్కీమ్ తెచ్చానని చెప్పుకోలేక.. కొత్త వాగ్ధానాలతో గారడీ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. వాళ్లు ప్రజల్లో లేరని.. 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా రావని అన్నారు. 175 స్థానాల్లో పోటీ పెట్టేందుకు కనీసం వాళ్లకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. వైసీపీ చరిత్ర విప్లవ గాథ.. వైసీపీ ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయగాథ.. మన భవిష్యత్తు సామాజిక వర్గాల ఇంద్రధనుస్సు అని అన్నారు. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీ అని స్పష్టం చేశారు. గడిచిన 56 నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి రెండింటిలోనూ సరికొత్త రికార్డు సృష్టించిన పార్టీ మనదని అన్నారు. మరో 70 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. అబద్ధానికి, నిజానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు.
సీఎంగా చంద్రబాబు మార్క్ ఎక్కడుంది?
చంద్రబాబు ఇచ్చిన హామీలు 10 శాతం కూడా అమలు చేయలేదని వైఎస్ జగన్ అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా.. చంద్రబాబు ఏం చేశారో చెప్పడానికి ఏమీ కనిపించదని అన్నారు. అదే వైసీపీ పథకాలను ఇంటి దగ్గరికే వచ్చి అందిస్తున్నామని చెప్పారు. 75 ఏండ్ల వయసు ఉన్న చంద్రబాబు 14 ఏండ్లు పాలించారని.. ఆ టైమ్లో అభివృద్ధి చేయాలని ఏనాడూ అనిపించలేదా? అని ప్రశ్నించారు. వాళ్లు పెత్తందార్లు కాబట్టే అభివృద్ధి ఆలోచన రాలేదని విమర్శించారు. ప్రజలను చంద్రబాబు పాలేర్లుగానే చూశారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ పల్లె బాగుపడదని అన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని తెలిపారు. అదే రైతు భరోసా అంటే గుర్తొకొచ్చేది మీ జగన్ అని అన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించామని తెలిపారు. 14 ఏండ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ ఎక్కడుందని జగన్ ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైసీపీ మార్క్ కనిపిస్తుందని స్పష్టం చేశారు.