Kethireddy Peddareddy | తాడిపత్రికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 12వ తేదీ బుధవారం నాడు పోలీసుల సమక్షంలో టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ నిరసన ర్యాలీని పోలీసులు, టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో పోలీసులు తీరును తప్పుబట్టడమే కాకుండా, టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడంపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేశారని విమర్శించారు.