Rushikonda | విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.500 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా ఈ ప్యాలెస్ నిర్మించారని చెబుతుండటంతో అందరూ షాకవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రుషికొండ ప్యాలెస్‌పై మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ కూడా ఆసక్తి చూపించారు.
రుషికొండలో నిర్మించిన ఆ ప్యాలెస్‌ను తనకు అమ్మాలని సీఎం చంద్రబాబును కోరుతూ సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశారు. అమ్మడం కుదరకపోతే కనీసం లీజుకు అయినా ఇవ్వాలని కోరారు. ఇందుకోసం మార్కెట్ ధర కంటే 20 శాతం అదనంగా చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొనడం విశేషం.
కాగా, రుషికొండలో ప్రభుత్వ భవనాలను అత్యంత విలాసవంతంగా నిర్మించారు. రూ.500 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి ఒక ప్యాలెస్‌ను నిర్మించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ భవనం కోసం విదేశాల నుంచి దిగుమతి అయిన మార్బుల్స్, టైల్స్‌ను గదుల్లో ఉపయోగించారు. దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూంలు, భవనం లోపల విలాసవంతమైన నడకదారులు, ఖరీదైన షాండ్లియర్లు, 400 మంది ఒకేసారి సమావేశమయ్యేలా మీటింగ్ రూంలు ఏర్పాటు చేశారు. భవనాల బయట ఎటు చూసినా పచ్చదనం, భవనాల లోపల నుంచే ఎటు చూసినా సముద్రం కనిపించేలా దీన్ని నిర్మించారు.
గత మూడేళ్లుగా రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల గురించి అస్సలు బయట తెలియనివ్వలేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భవనాల్లోని రహస్యాన్ని బయటపెట్టారు. ఇందులో ఒక్క ప్యాలెస్ కోసమే దాదాపు 500 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించారని ఆరోపించారు. ఇందులో ఒక్క బాత్రూం నిర్మాణం కోసమే రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారని విమర్శిస్తున్నారు. అయితే, విశాఖను రాజధాని చేయాలని అనుకున్నామని, అందుకే రాష్ట్రపతి, ప్రధాని వంటి వారి కోసం ఈ విలాసవంతమైన భవనాన్ని నిర్మించామని ముందుగా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అవి జగన్ ఉండటానికి కట్టలేదని.. పర్యాటక భవనాలు అని వివరిస్తున్నారు.