Srisailam | ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీశైల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు శనివారం పలు పార్కింగ్ ప్రదేశాలు, ఆరు బయలు ప్రదేశాలను పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఉన్నారు.
గంగాధర మండపం నుంచి దక్షిణం, ఉత్తర వైపు ప్రధాన రహదారులు, టూరిస్ట్ బస్టాండ్, యజ్ఞ వాటిక , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీప ప్రదేశాలు, సాంస్కృతిక కళా ప్రదర్శన వేదిక (యాంపీ థియేటర్), ఏనుగుల చెరువు కట్ట తదితర ప్రాంతాలను ఈఓ శ్రీనివాసరావు పరిశీలించారు. గంగాధర మండపం నుంచి నంది గుడి వరకూ ప్రధాన రహదారికి ఇరువైపులా భక్తులు సేద తీరడానికి తాత్కాలిక షెడ్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ షెడ్లలో గ్రీన్ మ్యాట్లు కూడా ఏర్పాటు చేయాలని అన్నారు.
గంగాధర మండపం నుంచి సర్వ దర్శనం క్యూలైన్ ప్రారంభ ప్రవేశ ద్వారం వరకూ ప్రధాన రహదారికి కుడివైపు దర్శనం కోసం భక్తులు వేచి ఉండటానికి విశాలమైన షెడ్, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. ప్రధాన రహదారికి ఎడమ వైపు సామాన్లు భద్రపరుచుకునే గది, పాదరక్షలు భద్రపరుచుకునే గదులను ఏర్పాటు చేయాలన్నారు. వీటిని వీలైనంత విశాలంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.
క్యూ కాంప్లెక్సుకు కుడి వైపున శాశ్వత ప్రాతిపదికన షెడ్ నిర్మించాలని శ్రీనివాసరావు చెప్పారు. ఈ షెడ్లో శీఘ్ర దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేసే వీలు కలుగుతుందన్నారు. వివిధ పార్కింగ్ ప్రదేశాల్లో ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జంగిల్ క్లియరెన్స్ (పిచ్చి మొక్కల తొలగింపు) తర్వాత వెంటనే గ్రావెల్ వేయించి, ఆయా ప్రదేశాలను చదును చేసి లెవెలింగ్ పనులు ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా పార్కింగ్ ప్రదేశాల్లో అక్కడక్కడ గల బండలు వెంటనే తొలగించి తగిన విధంగా చదును చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాలు, వాటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. అన్ని ప్రదేశాల్లోనూ ఎక్కువ సంఖ్యలో చెత్త కుండీలు ఏర్పాటు చేయాలన్నారు.
అన్ని పార్కింగ్ ప్రదేశాల్లోనూ మంచినీటి సదుపాయం, తాత్కాలిక విద్యుద్ధీకరణ పనులు చేపట్టాలని నీటి సరఫరా, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులను ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. వీలైనంత మేరకు అన్ని ప్రదేశాల్లోనూ తాత్కాలిక శౌచాలయాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే పార్కింగ్ ప్రదేశాల్లో వీలైనన్ని చోట్ల ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి, వాటిల్లో సమాచార కరప్రతాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాల్సిన దారులు, పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిపే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని శ్రీశైల ప్రభ, ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
పాత ఫిల్డర్ బెడ్లో సంచార వాటర్ ట్యాంకుల వాటర్ ఫిల్లింగ్ పాయింట్ ను ఈఓ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేయాలన్నారు. పాత ఫిల్టర్ బెడ్ వరకూ ఒకే రహదారి ఉందని, దీనివల్ల వాటర్ ట్యాంకుల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. కనుక అదనంగా వాటర్ ఫిల్లింగ్ పాయింట్ వరకూ మరో రహదారి ఏర్పాటు చేయాలని చెప్పారు. వాటర్ ట్యాంకర్లు ఫిల్లింగ్ పాయింట్ వరకూ వెళ్లేందుకు ఒకదారి, బయటకు వచ్చేందుకు మరో దారిని వినియోగించాలన్నారు.
పాత వాటర్ ఫిల్టర్ బెడ్ ప్రాంగణంలో ఉసిరివనం ఏర్పాటు చేయాలని ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ ప్రతిపాదిత వనంలో ఇతర దేవతా వృక్షాలు, ఫల వృక్షాలు, పూల మొక్కలు నాటాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. ఈ ప్రాంగణాన్ని కార్తీక వన భోజనాలకు అనువుగా తీర్చి దిద్దాలని చెప్పారు. దీనివల్ల ఈ ప్రదేశంలో భక్తులు కార్తీక మాసంలో వన భోజనాలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.
ఇక మాడ వీధిలోని కళా ప్రాంగణం వెనుక కూడా పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేయాలని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రదేశంలో ప్రముఖులు, అధికారుల వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఏనుగుల చెరువు కట్ట సుందరీకరణకు తగిన ప్రణాళికలు రూపొందించడంతోపాటు వెంటనే పనులు చేపట్టాలన్నారు. ఈ సుందరీకరణతో ఆలయ వెనుక భాగమంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో హేమారెడ్డి మల్లమ్మ మందిరం సమీపంలోని యాంపీ థియేటర్ లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పీఎం మురళీ బాలకృష్ణ, ఎం నరసింహారెడ్డి, పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్య నిర్వహణాధికారి బీ మల్లికార్జున రెడ్డి, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగం ఇన్ చార్జీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పీ చంద్రశేఖర శాస్త్రి, పీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.