Srisailam | శ్రీశైలం : శ్రీగిరి క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సేవలను దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దగ్గరుండి సమీక్షించారు. శివ భక్తుల క్యూలైన్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించిన మంత్రి, భక్తులకు కల్పించిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. యోగక్షేమాలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులకు సూచనలు చేశారు. ఇప్పటివరకు ఎదురైన చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
భక్తులు ఇరుముడిని విరమించే ప్రదేశాన్ని విస్తరించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శివ భక్తుల కోసం చేపట్టిన మహాశివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లను అడుగు అడుగునా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల అభిప్రాయాలను స్వీకరించి, మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భక్తులకు విశేష అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో మంత్రి ఆనం వెంట శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి ఉన్నారు.