Srisailam Temple | శ్రీశైలం : దేవీ శరన్నవరాత్రులు శ్రీశైల క్షేత్రంలో కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాల్గో రోజైన ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారులకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. భ్రమరాంబ అమ్మవారు కుష్మాండ దుర్గగా భక్తులకు అభయమిచ్చారు. దేవీ అవతారాల్లో కుష్మాండ దుర్గ సాత్విక రూపంలో సింహవాహనాన్ని అధిష్టించి ఎనిమిదిచేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల, అమృతకళశాన్ని దాల్చి భక్తులకు దర్శనమిచ్చినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
ఈ దేవిని పూజించడంవల్ల సర్వ రోగాలు తొలగిపోయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు వృద్ధిచెందుతాయని భక్తుల విశ్వాసం. అదే విధంగా సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు కైలాసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో అర్చక వేదపండితులు, కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, ప్రత్యేక హరతులు, షోడశపూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాకారోత్సవంతోపాటు గ్రామోత్సవంలో ఆదిదంపతులు కైలాస వాహనంపై క్షేత్ర పురవీధుల్లో విహరిస్తూ గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగింపు జరగ్గా గ్రామోత్సవంలో నాదస్వరం, కేరళ చండీమేళం, కొముకోయ నృత్యం, థయ్యం, విళక్కు, స్వాగత నృత్యాలు, కోలాటం, వేషధారణలు, అశ్వ ప్రదర్శన, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లన గ్రోవి, త్రిశూలం, జేగంట, కంచుడోలు, కొమ్ము, తాళాలు, చెక్కభజన, అమ్మవారి వేశం, తప్పెట చిందు, డోలు విన్యాసం, వీరభద్రడోలు కుణిత కన్నడ జానపదాల విన్యాసాలు చూసేందుకు భక్తులను కనువిందు చేశాయి.
అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. ప్రాకారోత్సవంలో కళాకారులు చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయని అధికారులు తెలిపారు. అదే విధంగా కళారాధనలో భాగంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు యాత్రికులను అలరించాయి. శరన్నవరాత్రుల్లో ఐదోరోజు సోమవారం భ్రమరాంబాదేవి అమ్మవారు స్కందమాతా అలంకారంలో దర్శనమివ్వనుండగా.. మల్లికార్జున స్వామివారితో కలిసి శేష వాహన సేవపై విహరించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.