Chandrababu Naidu | ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు, సీఐడీ చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గురువారం ఉదయం 11 గంటలకు పిటిషన్లపై విచారణ జరుపనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించగా.. మరోసారి చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. అదే సమయంలో చంద్రబాబుకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడో పేర్కొంటూ వాదనలు వినిపించారు. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ విదేశాలకు పరారయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించి న్యాయమూర్తి ఇద్దరు ఐటీ దర్యాప్తులో ఉన్నవారేనా? అని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుతో ఆర్థిక లావాదేవీలు జరపడం కారణంగానే విదేశాలకు పారిపోయినట్లుగా కోర్టుకు తెలిపారు. వాంగ్మూలం ఇచ్చిన పీవీ రమేశ్ మాటమార్చారన్నారు. అయితే, ఇద్దరు విదేశాలకు వెళ్తే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదని సరైందేనా? అంటూ న్యాయవాది దూబే ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవని, అప్పటి ఆర్థికశాఖ అధికారి గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారని, ఆ తర్వాత సీమెన్స్ ప్రాజెక్టుకు అభ్యంతరం తెలుపలేదన్నారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని.. కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ తర్వాత ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు.
స్కామ్ కేసు చంద్రబాబు చుట్టూనే తిరిగిందని, వ్యక్తిగత లబ్ధి చేకూరిందన్నారు. 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ హెచ్చరికల నేపథ్యంలో కంటితుడుపు విచారణకు ఆదేశించిందని, ఆ తర్వాత బుట్ట దాఖలు చేశారన్నారు. సామాజిక, ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని, స్కిల్ కేసులో అన్నీ చంద్రబాబు సూచనల మేరకే జరిగాయని ఏఏజీ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు.
జైలులో ఉండగానే ప్రభావితం చేస్తున్నారన్నారు. స్కామ్ కేసు ఇదేం ఫిక్షన్ స్టోరీ కాదని, సాక్షాలున్నాయన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే కస్టడీకి కోరుతున్నామన్నారు. ప్రస్తుతం స్కిల్ స్కామ్ కేసులో విచారణ దశలో ఉందని, బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కోరారు. అయితే, కేసులో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. మరో వైపు ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ స్కామ్‌పై సైతం విచారణ జరిగింది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, చంద్రబాబు తరఫున సిద్దార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. అలాగే స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది.