చిత్తూరు : రాష్ట్రంలో రోజుకో ప్రాంతంలో మహిళలపై లైంగికదాడులు వెలుగులోకి వస్తున్నాయి. కుప్పంలో దారుణం చోటు చేసుకున్నది. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు అతగాడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మర్మాంగంపై తీవ్రంగా గాయాలు కావడంతో పోలీసులు అతడ్ని స్థానిక దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పం పట్టణానికి చెందిన 45 సంవత్సరాల శ్రీధర్ అనే వ్యక్తి ఒకరు.. మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆరేండ్ల చిన్నారిని మాటలతో మభ్యపెట్టి సమీపంలో ఉన్న పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. గమనించిన స్థానికులు బాలికను రక్షించి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. అనంతరం చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి శ్రీధర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఒంటిపై బట్టలు విప్పేసి చితకబాదారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
నిందితుడు శ్రీధర్ మర్మాంగంపై తీవ్రంగా గాయాలు కావడంతో పోలీసులు అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికపై లైంగికదాడికిపాల్పడిన శ్రీధర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, కుప్పంలో బాలికపై లైంగికదాడి తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఘటనపై స్థానిక పార్టీ నేతలతో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు.