అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కళ్లలో ఆనందం చూడటానికి వైఎస్ షర్మిల (YS Sharmila) మాజీ సీఎం జగన్‌పై నిందలు వేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YCP MP Vijayasai Reddy) ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ మళ్లీ సీఎం పీఠం అధిరోహించకూడదు అనే ఉద్దేశంతో జగన్ (YS Jagan) తప్ప ఇంకేవరైనా సీఎం పదవి పరవలేదన్న చంద్రబాబు ఇచ్చిన ఎజెండాతో ముందుకు వెళుతున్నారని షర్మిలపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ షర్మిల చంద్రబాబుతో, ఎన్డీయేతో లాలూచి పడి జగన్‌పై వ్యతిరేకంగా పనిచేస్తున్న దాంట్లో సందేహం లేదని పేర్కొన్నారు. ఇది ఆస్తా తగదా కాదు. అధికారానికి సంబంధించిన తగాదా అని పేర్కొన్నారు. ఆమె ఇప్పటివరకు పెట్టిన మీడియా సమావేశాలన్నీ జగన్‌ను తిట్టడానికేనని విమర్శించారు.
చెల్లెలుపై ప్రేమతో ఆస్తులు రాసిస్తే షర్మిల రిటర్న్ గిఫ్ట్‌గా బాబుతో లాలూచీ పడి జగన్‌ను వంచించారని, జగన్‌ను జైలుకు పంపడమే చంద్రబాబు, షర్మిల లక్ష్యమని ఆరోపించారు. చంద్రబాబుతో స్నేహం ఎంతమాత్రం మంచిది కాదని సూచించారు. వైఎస్సార్ మృతికి కారణమైన కాంగ్రెస్, బాబుతో చేతులు కలుపుతారా అంటూ ప్రశ్నించారు.
జగన్‌ను నమ్మవొద్దని వైసీపీ శ్రేణులకు పిలుపునివ్వడం ద్రోహమని, అన్యాయమని అన్నారు. జగన్ తన సొంత ఆస్తిలో 40 శాతం షర్మిలకిస్తానని ఎంఓయూ చేశారని వెల్లడించారు. కోర్టుల్లో కేసుల పరిష్కారం అయ్యాక 40శాతం ఇస్తామన్నారని స్పష్టం చేశారు.