Maoists | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో మరోసారి తుపాకులు గర్జించాయి. తూటాల వర్షం కురిసింది. పోలీసులు – మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్రా లడ్డా తెలిపారు. బుధవారం తెల్లవారుజామున బీఎం వలస వద్ద కాల్పులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలను మధ్యాహ్నం వరకు మీడియాకు వెల్లడిస్తామన్నారు. చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఆజాద్, దేవ్జీ ఉన్నట్లు సమాచారం. నిన్న పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను ఇవాళ విజయవాడలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మహేశ్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులు ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టి.. మావోయిస్టుల కదలికలను గమనించారు. నవంబర్ 17న ఒక ఆపరేషన్ ప్రారంభించాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.
ఇక ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్నారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, డివిజినల్ కమిటీ మెంబర్లు ఐదుగురు, ఏరియా కమిటీ మెంబర్స్ 19 మంది ఉన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.