Puttaparthi | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రశాంత నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల భవనాలన్నీ రంగు రంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు. శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ హాజరయ్యారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని సచిన్, ఐశ్వర్య రాయ్ దర్శించుకున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్‌ను కలిసిన వారిలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై సత్యసాయిబాబాపై రూపొందించిన రూ.100 నాణేన్ని, తపాల బిళ్లను విడుదల చేస్తారని రత్నాకర్ తెలిపారు. 22న జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచ్చేస్తారని చెప్పారు. అదేరోజు సాయంత్రం జరిగే స్నాతకోత్సవానికి, 23న జరిగే జయంతి వేడుకలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతారని తెలిపారు.