అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు (Assembly) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు ఐదురోజుల పాటు కొనసాగే అవకాశముంది. ఈ సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని టీడీఎల్పీ సూచించింది.
ఈ సందర్భంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Budget) గడువు ఈనెలాఖరుతో ముగియనుండడంతో మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి, అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కూటమి ఇచ్చిన కీలక హామీలపై బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి .
వైసీపీ పాలన తీరుపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chief Minister Chandra babu)మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయనున్నారు. జూన్లో అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం తొలిసారిగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీ నిర్వహించింది. ప్రస్తుతం రెండోసారి రేపటి నుంచి పూర్తిస్థాయి సమావేశాలు నిర్వహించనున్నది.