తిరుపతి : దొంగలు తాపీగా దొంగతనం చేశారని మనం వింటుంటాం. తాజాగా తిరుపతి పట్టణంలో జరిగిన భారీ దొంగతనం ఈ కోవకే చెందుతుంది. ఓ వ్యాపారి ఇంటిని దోచుకున్న దొంగలు.. ఆ ఇంట్లోని సీసీ కెమెరాలు కూడా విప్పుకుని పోయారంటే.. వాళ్లు ఎంత తాపీగా దొంగతనం చేశారో అర్ధమవుతుంది.
తిరుపతి పట్టణంలోని మంగళం తుడా క్వార్టర్స్‌లో ఓ వ్యాపారి ఇళ్లు ఉన్నది. ఆ ఇంటి ఆసామి ఏలిరెడ్డి ఓ వ్యాపారి. ఈ నెల 7 వ తేదీన తల్లికి వైద్యం చేయించేందుకు ఏలిరెడ్డి వేలూరులోని సీఎంసీకి వెళ్లారు. తిరిగొచ్చే సరికి దొంగలు ఇల్లు దోచుకున్నారు. 25 గ్రాముల బంగారం, 8 డైమండ్స్, రూ. 1,92,000 నగదును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా, ఇంట్లోని బ్యాటరీలు, ఇన్వర్టర్, సిలిండర్‌తో పాటు తమ దొంగతనం ఆనవాళ్లు కూడా దొరకకుండా ఉండేందుకు ఇంటికి బిగించిన సీసీ కెమెరాలు, రికార్డర్‌ను సైతం దొంగలు తమ మూటలో సర్దుకుని ఎంచక్కా వెళ్లిపోయారు.
తల్లి అనారోగ్యం గురించి తెలుసుకన్న ఏలిరెడ్డి సోదరుడు మరుసటి రోజున ఇంటికొచ్చాడు. తలుపులు తెరిచి ఉండి ఇళ్లంతా చిందరవందరగా ఉండటాన్ని చూసి స్థానిక అన్న ఏలిరెడ్డికి సమాచారం అందించాడు. దాంతో ఇంటికి చేరుకున్న ఏలిరెడ్డి లోపల పరిశీలించి దొంగతనం జరిగినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అలిపిరి పోలీసులు, క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అలిపిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.