Prakasham Barrage | ప్రకాశం బ్యారేజి గేట్లు అనుకున్నంతగా దెబ్బతినలేదని ఇంజనీరింగ్ నిపుణుడు, ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తెలిపారు. ఒక గేటుకు బోటు తగిలిందని పేర్కొన్నారు. కౌంటర్ వెయిట్ బ్రేక్ అయ్యిందని.. కొత్త బాక్సులను డిజైన్ చేసినట్లు చెప్పారు. ఏపీలో కురిసిన కుండపోత వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో మంగళవారం ఉదయం పలువురు ఇంజనీరింగ్నిపుణులు ప్రకాశం బ్యారేజికి వెళ్లి పరిశీలించారు.
కౌంటర్ వెయిట్ లేకున్నా.. గేట్లు దింపొచ్చని కన్నయ్యనాయుడు తెలిపారు. మళ్లీ గేట్లు ఎత్తేలోపే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. ఒక్క గేటుకే సమస్య ఉన్నందున మిగిలిన గేట్లు ఎత్తుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజిని ఢీకొన్న బోట్లను, గేట్లు దించేలోపే తీయాలని చూస్తున్నట్లు తెలిపారు.
వరద ఉధృతిలో కొట్టుకొచ్చిన నాలుగు బోట్లు సోమవారం నాడు ప్రకాశం బ్యారేజి 3, 4 గేట్లను ఢీకొన్నాయి. వరద ఉధృతితో తొలుత ఎగువ నుంచి ఒక బోటు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజిని ఢీకొట్టింది. ఏం జరుగుతుందా అని చూసేలోపే మరో మూడు బోట్లు వచ్చి బ్యారేజి గేట్లను ఢీకొట్టాయి. 40 కి.మీ. వేగంతో వచ్చి బోట్లు ఢీకొట్టడంతో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతం దెబ్బతిన్నది. కాగా, బోట్లు కొట్టుకురావడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వేరే ప్రాంతం నుంచి కొట్టుకొస్తున్నాయా? ఎవరైనా పనిగట్టుకుని చేస్తున్నారా? అని సందేహిస్తున్నారు.