Ramani Kalyanam | దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రమణి కళ్యాణం. ఈ సినిమా టైటిల్ను ఇవాళ అధికారికంగా చిత్రబృందం లాంచ్ చేసింది. కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోనీ, జీవీ ప్రకాశ్ కుమార్, సామ్ సిఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు ఈ టైటిల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు.
జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం తెలిపింది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతోన్నామని పేర్కొంది. ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ తిరుకోవెల డీవోపీ, రవితేజ గిరిజాల ఎడిటర్. యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీశ్, విజయ్ ఆదిరెడ్డి స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు.
కోర్ట్ సినిమాతో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రామ్ జగదీశ్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. రమణి కళ్యాణం తన అందమైన ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయి.